![]() |
![]() |

తారాగణం: కరిష్మా తన్నా, మొహమ్మద్ జీషన్ అయూబ్, ప్రసేన్‌జిత్ చటర్జీ, హర్మాన్ బవేజా, తనిష్ఠా చటర్జీ, దేవెన్ భోజాని
స్టోరీ: జిజ్ఞా వోరా
స్క్రీన్‌ప్లే: అనుసింగ్ చౌధరి
డైలాగ్: కరణ్ వ్యాస్
మ్యూజిక్: అంచిత్ ఠక్కర్
సినిమాటోగ్రఫీ: ప్రథాం మెహతా
ఎడిటింగ్: అమితేష్ ముఖర్జీ
డైరెక్టర్: హన్సల్ మెహతా
బ్యానర్: మ్యాచ్బాక్స్ షాట్స్
ఓటీటీ ప్లాట్‌ఫాం: నెట్‌ఫ్లిక్స్
డైరెక్టర్ హన్సల్ మెహతా రూపొందించిన క్రైమ్ డ్రామా సిరీస్ 'స్కూప్'.. ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జిజ్ఞా వోరా జీవిత చరిత్ర జ్ఞాపకం 'బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా: మై డేస్ ఇన్ ప్రిజన్' ఆధారంగా రూపొందింది. 2011లో జరిగిన ముంబై టాబ్లాయిడ్ మిడ్-డే రిపోర్టర్ జ్యోతిర్మయి డే హత్య కేసులో నిందితురాలిగా జిజ్ఞా వోరా ఆరోపణలు ఎదుర్కొన్న నాటి ఘటనలతో ఈ సిరీస్‌ను తీశారు హన్సల్ మెహతా.
జర్నలిజంలో స్కూప్స్కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇతర మీడియా సంస్థలు ఇవ్వని ఆసక్తికర విషయాన్ని ప్రత్యేక వార్త (స్కూప్) రూపంలో ఇచ్చే జర్నలిస్టులకు మంచి డిమాండ్ ఉంటుంది. జనానికి స్కూప్స్ అనేవి కుతూహలాన్ని కలిగిస్తే, సంబంధిత వ్యక్తులకు మాత్రం అవి నిద్రలేని రాత్రులను మిగిల్చే అవకాశం ఉంది. ఎవరూ ఊహించని విషయంతో తొలిసారిగా ఒక వార్త బయటకు వస్తే, అది సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. చాలామంది జర్నలిస్టులు ఇలాంటి స్కూప్స్ ఇవ్వడానికి పోటీలు పడుతుంటారు.
కథ
'స్కూప్' సిరీస్‌లో జాగృతి పాఠక్ (కరిష్మా తన్నా) అలాంటి ఒక క్రైం రిపోర్టర్. అతి తక్కువ కాలంలో తను ఇచ్చే స్కూప్స్ ద్వారా తను పనిచేసే వార్తాపత్రికలో డిప్యుటీ బ్యూరో చీఫ్ స్థాయికి ఎదుగుతుంది. మరో క్రైం రిపోర్టర్ జైదేవ్ సేన్ అలియాస్ దాదా (ప్రసేన్‌జిత్ చటర్జీ) హత్య కేసులో ప్రధాన నిందితురాలనే ఆరోపణలతో పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకొని జైలుకు పంపుతారు. బెయిల్‌పై బయటకు వచ్చే లోగా సుమారు ఎనిమిది నెలలపాటు భయంకరమైన జైలు జీవితం గడుపుతుంది జాగృతి. తన పోటీదారుడ్ని లేకుండా చేయడానికి అండర్‌వరల్డ్‌లోని కనెక్షన్స్‌ను ఆమె ఉపయోగించుకుందనేది చాలామంది నమ్మే విషయం. ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని జాగృతి ఎలా నిరూపించుకుందనేది మిగతా కథ.
విశ్లేషణ
'స్కాం 1992' లాంటి సక్సెస్ఫుల్ సిరీస్ తర్వాత హన్సల్ డైరెక్ట్ చేసిన సిరీస్ 'స్కూప్'. ఒక దృష్టి కోణం నుంచి తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటింగా చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తించినట్లుగా ఆయా పాత్రలను ఆయన తీర్చిదిద్దాడు. వార్తా పత్రికలు ఎలా పనిచేస్తాయో, జర్నలిస్టుల మధ్య వృత్తిపరమైన పోటీ ఏ స్థాయిలో ఉంటుందో, విలువలు ఎలా పరీక్షకు నిలబడుతుంటాయో, సంచలనాల కోసం నిజాల స్థానంలో కట్టుకథలు ఎలా అల్లబడతాయో ఈ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. న్యూస్ ఎలా బిజినెస్ కింద మారతాయో ఇందులో మనం చూస్తాం. ఎక్కువ నాటకీకరణ లేకుండానే చాలా సన్నివేశాలు మన హృదయాన్ని స్పృశిస్తాయి. జాగృతి లాంటి స్త్రీలు తామున్న పరిస్థితులకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సినిమా చెబుతుంది. అయితే సంచలనాల కోసం పాకులాడే క్రమంలో నిజాల్ని కప్పిపుచ్చే జర్నలిస్టులతో పాటు ఇమ్రాన్ లాంటి నిజాయితీపరులైన జర్నలిస్టులూ ఉంటారని 'స్కూప్'లో మనం చూస్తాం. జాగృతికి అండగా నిలవడంలో తన ఉద్యోగాన్ని కోల్పోయినా నిజాయితీని వదులుకోడు ఇమ్రాన్. న్యాయం కోసం పోరాటంలో జాగృతికి ఆమె కుటుంబం, ఆమె లాయర్ ఇచ్చే సపోర్ట్ మనల్ని ఆకట్టుకుంటుంది.
నటీనటుల పనితీరు
జాగృతి పాఠక్ పాత్రలో కరిష్మా తన్నా బాగా రాణించింది. ఇంతదాకా ఆమె చేసిన పాత్రల్లో ఇదే బెస్ట్ అని చెప్పాలి. చాలా సునాయాసంగా జాగృతిలా ప్రవర్తించింది. జైలులో తోటి ఖైదీలను ఎదుర్కొనే సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. బ్యూరో చీఫ్ ఇమ్రాన్ సిద్దిఖి రోల్లో మొహమ్మద్ జీషన్ అయూబ్ చక్కగా ఇమిడిపోయాడు. ప్రేక్షకులు ఆ పాత్రను ప్రేమించకుండా ఉండలేదు. ఇక కీలకమైన క్రైం రిపోర్టర్ జైదేవ్ సేన్ క్యారెక్టర్లో ప్రసేన్‌జిత్ చటర్జీ మెప్పించాడు. జీసీపీ హర్షవర్ధన్ ష్రాఫ్గా హర్మాన్ బవేజా పాత్ర పరిధి మేరకు నటించాడు. మిగతావాళ్లు కూడా పాత్రల్ని అర్థం చేసుకొని వాటిని పోషించారు.
తెలుగువన్ పర్స్పెక్టివ్
చాలా సందర్భాల్లో రోమాలు నిక్కబొడుచుకొనే థ్రిల్స్‌తో, వేగవంతమైన కథనంతో హన్సల్ మెహతా రూపొందించిన 'స్కూప్'.. క్రైం డ్రామాస్ను ఇష్టపడే వాళ్లతో పాటు సీరియస్ ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించేవాళ్లను సైతం ఆకట్టుకుంటుంది.
- బుద్ధి యజ్ఞమూర్తి
![]() |
![]() |